ప్రాజెక్టువర్కు భవితకెంతో ముఖ్యం
- * ప్రాంగణేతర నియామకాల్లో ఉద్యోగం పొందాలంటే ప్రాజెక్టువర్కు చాలా కీలకం
* మొక్కుబడిగా కాకుండా పూర్తిశ్రద్ధతో, ఆసక్తితో చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల మందికిపైగా ఇప్పుడు బీటెక్ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ను పూర్తి చేశారు. వారిలో ఇప్పటివరకు 10 వేల మందివరకూ ప్రాంగణ నియామకాల్లో సాఫ్ట్‌వేర్, ఉత్పత్తి ఆధారిత పరిశ్రమలు, నిర్మాణ సంస్థల్లో ఎంపికై ఉంటారని విశ్వవిద్యాలయ అధికారుల అంచనా. జనవరి చివరి వారం నుంచి ఏప్రిల్ వరకు మాత్రమే రెండో విడత ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తారు.
మైక్రోసాఫ్ట్ లాంటి కొన్ని సంస్థలు ఇంటర్న్‌షిప్ పేరిట తమ కంపెనీల్లో పనిచేసేందుకు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ప్రాజెక్టు వర్కు కాలంలో రెండు మూడు నెలలపాటు పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఇన్ఫోసిస్ ఉద్యోగాలకు ఎంపికైన కంప్యూటర్ సైన్స్, ఐటీ విద్యార్థులు ప్రధాన ప్రాజెక్టును తమ సంస్థలో చేసుకోవాలని చెబుతోంది. దీనివల్ల అనుభవంతోపాటు ప్రాజెక్టును పూర్తి చేసినట్లవుతుంది.4 నెలలపాటు చేసినందుకు నెలకు రూ.10 వేల వరకు స్త్టెపెండ్ కూడా ఇస్తోంది. దాన్నే శిక్షణ కాలంగా కూడా పరిగణిస్తున్నారు. ఇప్పుడు చాలా కంపెనీలు ఎంపికైన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఇస్తున్నాయి. దానికి ప్రయత్నించడం మంచిది. కంపెనీకి ఉద్యోగులు అవసరమై, ఇంటర్న్‌షిప్‌లో ప్రతిభ చూపితే ఉద్యోగం కూడా దక్కించుకోవచ్చు. ప్రాంగణ నియామకాలకు వస్తున్న కంపెనీలు ముఖ్యంగా ప్రధాన ప్రాజెక్టువర్కుపై ప్రశ్నిస్తాయి. సబ్జెక్టు నిపుణులు ఒకటీ రెండు సమాధానాలకే మీరు సొంతగా ప్రాజెక్టు చేశారో, రెడీమేడ్ ప్రాజెక్టును కొన్నారో సులభంగానే గుర్తించేస్తారు. ఇప్పటికే ప్రాంగణ నియామకాలకు ఎంపిక కానివారు ప్రాజెక్టువర్కుపై 100 శాతం శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నికల్ ఇంటర్వ్యూలో మొదట అడిగే ప్రశ్న ప్రాజెక్టువర్కు దేనిపై చేశావన్నదే! ప్రాజెక్టును సొంతగా చేస్తే సబ్జెక్టుపై పట్టు ఉన్నట్లే లెక్క!
ఈ సూచనలు పాటించండి
జేఎన్‌టీయూ ఆచార్యులు రమణారావు, జీకే విశ్వనాథ్‌లు ఇలా సూచిస్తున్నారు...
* ప్రస్తుతం మీరు ప్రాజెక్టువర్కు చేయాలనుకున్న రంగంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవాలి. వాటికి పరిష్కార మార్గం చూపగలగాలి.
* మీ ఆలోచనపై గతంలో ఎవరైనా ఇలాంటి ప్రాజెక్టు చేశారో లేదో గుర్తించాలి. ఒకవేళ ఉన్నా భిన్నమైన, ఇతర ప్రత్యామ్నాయాలను చూపగలిగితే ముందడుగు వేయాలి.
* మంచి గైడ్ (పర్యవేక్షకుడు)ను ఎంచుకోవాలి.
* ఇద్దరు ముగ్గురు సంయుక్తంగా చేయడం వల్ల అభిప్రాయాలు పంచుకోవడం, గౌరవించుకోవడం, చర్చించుకోవడం, కలిసి పనిచేయడం తెలుస్తుంది.
* ఆలోచన నుంచి ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ సొంతగా చేస్తే ఇంటర్వ్యూలో ఏ ప్రశ్న సంధించినా సమాధానం తడబడకుండా, ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతారు. దాంతో చివరి దశలోనైనా ఉద్యోగం మీ సొంతమవుతుంది!
Comments
Post a Comment